డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్దుల ఆరోగ్యం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తీవ్ర అస్వస్ధతకు గురైన విద్యార్దినికి మంత్రి ప్రత్యేక చొరవతో వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే…నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో 6 వ తరగతి విద్యార్దిని ఇటీవల తీవ్ర అస్వస్దతకు గురికాగా హాస్టల్ వార్డెన్, సిబ్బంది గూడూరులోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చేర్పించి వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న మంత్రి స్వామి నెల్లూరు జిల్లా కలెక్టర్ , డాక్టర్లతో మాట్లాడి విద్యార్దినిని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో చేర్పించి ప్రత్యేక వైద్యం చేయించారు. ప్రస్తుతం విద్యార్దిని ప్రాణాపాయ స్ధితి నుంచి కోలుకుని ఆరోగ్యం నిలకడగా ఉంది. మరికొద్ది రోజుల్లో విద్యార్థినిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి విద్యార్దిని, ఆమె తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు తీవ్ర అనారోగ్యానికి గురైన 30 మందికి పైగా అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్దులకు ప్రత్యేక చొరవతో కార్పోరేట్ ఆస్పత్రులలో మంత్రి వైద్యం చేయించి వారి ప్రాణాలు కాపాడారు.
