పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
స్పష్టం చేశారు. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మరింత దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సి.ఎస్. టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రకాశం జిల్లా నుంచి కలెక్టర్ పి.రాజాబాబు క్యాంప్ కార్యాలయం నుంచి ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, అతిసార వంటి వ్యాధులు వ్యాపించకుండా చేయడానికి పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకమన్నారు. దీనితోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశాలు, ఏఎన్ఎంలు కూడా ప్రజల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామాలలో మురుగును ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలని చెప్పారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని, పూర్తిస్థాయిలో నాణ్యత పరీక్షలు, క్లోరినేషన్ చేశాకే తాగునీరు విడుదల చేయాలని స్పష్టం చేశారు.
