తుఫాను దృష్ట్యా ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సీనియర్ ఐఏఎస్ అధికారి, జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్.పి.సిసోడియా ప్రజలకు చెప్పారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో పర్యటించారు. తీర ప్రాంతంలోని పరిస్థితి, చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించారు. స్థానికులతోనూ ఆయన మాట్లాడారు. తుఫాను దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని, మరో 24 గంటలపాటు ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సిసోడియా వెంట జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, మండల స్పెషల్ ఆఫీసర్, డిఆర్డిఏ పి.డి. నారాయణ, లైజనింగ్ ఆఫీసర్ కళావతి, ఎంపీడీవో శ్రీకృష్ణ, తహసిల్దార్ శాంతి, అధికారులు ఉన్నారు.


