భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
చెప్పారు. మంగళవారం కలెక్టరేటుకు వచ్చిన ఆయన… వర్షాల దృష్ట్యా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించారు. వివిధ శాఖలను సమన్వయం చేస్తూ 24 గంటలూ పనిచేసేలా ఏర్పాటుచేసిన ఈ కంట్రోల్ రూము ద్వారా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్న తీరును కలెక్టర్ పి.రాజాబాబు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. అధికారులతోనూ మంత్రి సమీక్షించారు.
అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణలతో కలిసి విలేకరులతో మంత్రి మాట్లాడారు. గత తొమ్మిది రోజుల నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను అభినందించారు. మరో రెండు రోజులపాటు ఇదే స్ఫూర్తితో , సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2900 మందిని వాటిలోకి తరలించినట్లు ఆయన చెప్పారు. వీరికి అవసరమైన అల్పాహారము, భోజనము, ఇతర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితిని అధికారులు నిరంతరం నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగరాదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం సచివాలయంలోని ఆర్టిజిఎస్ సెంటర్ నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించినట్లు ఆయన తెలిపారు. కావున అధికారులు తీసుకునే నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. ఎలాంటి సమస్య తలెత్తినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి చెప్పారు. ఈ విధంగా కంట్రోల్ రూము దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి పరిష్కరించిందన్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలితే వెంటనే పరిస్థితిని చక్కదిద్దినట్లు వివరించారు. ముందు జాగ్రత్తగా ప్రజలకు క్యాండిల్స్, అగ్గిపెట్టలను, ఆహార సామాగ్రిని పంపిణీ చేశామన్నారు. దురుద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేసే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అలాంటి సమాచారాన్ని నమ్మవద్దని, గ్రామ, వార్డు సచివాలయం ప్రామాణికంగా వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితిని జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని ఆయన ప్రకటించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనివార్యమైతే కాచిచల్లార్చిన నీటిని త్రాగాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.
కలెక్టర్ మాట్లాడుతూ పరిస్థితి చక్కబడినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించే వరకూ ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు, బాలింతలకు, చిన్నారులకు అవసరమైన పోషకాహారాన్ని, ఔషధాలను అందిస్తున్నట్లు చెప్పారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల
వలన మరింత నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదన్నారు. ఫలితంగా నీళ్లు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలో 30 లోతట్టు కాలనీలను గుర్తించామన్నారు. కోస్తా మండలాల్లో 10 లోతట్టు ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో రెండు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
సిసోడియా సమీక్ష
జిల్లాపై తుఫాను ప్రభావాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి, జోనల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్.పీ. సిసోడియా సమీక్షించారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన ప్రకాశం భవనంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లతో కలిసి అధికారులతో చర్చించారు. ప్రాణనష్టం జరగరాదన్నది అంతిమ లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. తుఫాను తీరాన్ని దాటే సమయంలో బలమైన గాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున రోడ్లు పక్కన, డివైడర్ల మధ్యలో ఎలాంటి హోర్డింగ్స్ ఉన్నా తొలగించాలని ఆదేశించారు. కాగా, నష్ట నివారణ కోసం చేపట్టిన ముందస్తు చర్యలను కలెక్టర్
ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ కూడా సిసోడియాను కలిశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ తో కలిసి కొత్తపట్నంలో సిసోడియా పర్యటించారు.


