తుఫాను ప్రభావ పరిస్థితి నుంచి బాధితులు
పూర్తిగా కోలుకొని సాధారణ జీవితాన్ని కొనసాగించేలా అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి
చెప్పారు. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో
ముంపునకు గురై పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, ఇతర నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమం గురువారం డీఎస్ఓ పద్మశ్రీ అధ్యక్షతన ఆ గ్రామంలో జరిగింది. మంత్రితోపాటు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, పౌరసరఫరాల శాఖ ఎం.డి. ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫానుకు ముందు నుంచే భారీ వర్షాలు కురిసాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కే. పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోం మంత్రి వి.అనిత, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షించడంతో జిల్లాస్థాయిలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమై సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టడం వలన తుఫాను సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. అయినప్పటికీ లోతట్టు ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు ముంపునకు గురికావడం వలన వారిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన అల్పాహారము, ఆహారము పెట్టి, వైద్య సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. బాధితులు తమ గృహాలకు వెళ్లిన తర్వాత వారి జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిత్యవసర వస్తువులను, ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పంచదార, కేజీ పామ్ ఆయిల్, కేజీ బంగాళదుంపలను ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్దేశం మేరకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామన్నారు. నష్టపోయిన పంటలకు కూడా ప్రభుత్వం పరిహారం ఇస్తుందని మంత్రి తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను ముప్పు తొలగడంతో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంతోపాటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయించినట్లు తెలిపారు. ఇళ్లలో పేరుకుపోయిన బురదను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ప్రాంతాలలో శుక్రవారం నుంచి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. భారీ వర్షాలు, అనంతరం తుఫాను ప్రభావం చెరువుకొమ్ముపాలెంపై అధికంగా ఉండడంతో ముందుగా ఇక్కడే బియ్యం, ఇతర నిత్య అవసరాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
ఢిల్లీ రావు మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు. బాధితులకు అవసరమైన సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకే అమరావతి నుంచి తాను వచ్చానని వివరించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెగ్యులరుగా ప్రతినెలా ఇచ్చే రేషన్ సరుకులకు అదనంగా తుఫాను బాధితులకు ప్రస్తుతం ఈ సరుకులను ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, తాసిల్దార్ మధు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

