దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు అమోఘమని, స్ఫూర్తిదాయకమని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధుల్లో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని రాష్ట్రీయ ఏకతా దివస్‌గా జరుపుకుంటామని తెలిపారు. విశాల భారతావనిని ఏకతాటిపైకి తీసుకువచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. బ్రిటిషర్లు భారత్‌ను విడిచిపోయిన అనంతరం దేశ రక్షణ, సమగ్రత కోసం ఆయన అపారమైన కృషి చేశారని, అందుకే ఆయనకు “ఉక్కు మనిషి” అనే గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఉప ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. అలాగే ఆయనకు హోం శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. ఆ సమయంలో రాజుల పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలను దేశంలో విలీనం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, సమగ్ర భారతదేశానికి తుది రూపు ఇచ్చారు. సుమారు 550కు పైగా స్వతంత్ర రాజ్యాలను భారత్‌లో కలిపి, ఐక్య భారత నిర్మాణానికి అలుపెరగని కృషి చేశారు. భిన్న జాతులు, భాషలు, భౌగోళిక పరిస్థితులు ఉన్నా భారత దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పటేల్ గారు ఎంతో కృషి చేశారని కొనియాడారు.
అనంతరం పోలీస్ సిబ్బందిలో ఐక్యతాభావం పెంపొందేలా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరిచే దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని, అంతేకాక ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నామని, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్య వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతే గాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తామని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నామని ప్రతిజ్ఞ చేయించారు.
భారత జాతిని ఐక్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన భారత ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ (ఐక్యత కొరకు పరుగు) కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ గారు జెండా ఊపి ప్రారంభించి, ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మ దినాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ గా జరుపుకుంటూ, ఐక్యతా పరుగు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ టౌన్ సీఐ లు నాగరాజు, శ్రీనివాసులు, విజయకృష్ణ, ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, ఒంగోలు సబ్ డివిజన్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



