తుఫాను ప్రభావ ప్రాంతాలలో బాధిత ప్రజల సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు -జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ

     తుఫాను ప్రభావ ప్రాంతాలలో బాధిత ప్రజల సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. శనివారం మద్దిపాడులోని పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్థిక సహాయం, నిత్యవసర వస్తువులను స్థానిక శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్, రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య చైర్మన్ జయంతిబాబులతో కలిసి ఆయన అందించారు. 
      ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో ఉన్నవారికి 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, కేజీ పామ్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలను ఇస్తున్నామన్నారు. మత్స్యకార కుటుంబాలు అయితే ఈ నిత్యవసర సరుకులతో పాటు 50 కేజీల బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందిన ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున, ముగ్గురు ఉంటే మూడు వేలు లేదా గరిష్టంగా కుటుంబానికి 3000 ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అందిస్తున్నామన్నారు. 
       శాసనసభ్యులు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత తక్షణ జీవనాధారం కోసం ప్రభుత్వం ఈ విధమైన సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం సమర్థంగా పనిచేయటం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు. వివిధ రూపాలలో జరిగిన నష్టానికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు. జయంతి బాబు మాట్లాడుతూ జిల్లాలో దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వానికి పంపించి త్వరగా పరిహారం వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. 
      ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతి, తహసిల్దార్ ఆదిలక్ష్మి, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *