కార్తీక మాసం పవిత్రత నేపథ్యంలో రానున్న కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాలు, నదులు, బీచ్లు, చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు తెలిపారు.
పుణ్యస్నానాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో, క్యూ లైన్లలో తోపులాటలు జరగకుండా ఓపికతో, ప్రశాంతంగా దర్శనం/స్నానం చేసుకోవాలన్నారు. దీపాలు వెలిగించే సమయంలో ఇతర వస్తువులు లేదా వ్యక్తులకు అంటుకోకుండా అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తుపానుల ప్రభావం వల్ల వాగులు, చెరువులు మరియు అలలు ఉధృతంగా ఉన్నాయి. బీచ్లు, నదులు, చెరువుల వద్ద పుణ్యస్నానాలు చేసేటప్పుడు లోతైన ప్రాంతాలకు వెళ్ళరాదు. స్నాన ఘట్టాల వద్ద విధి నిర్వహణలో ఉన్న గజ ఈతగాళ్లు మరియు భద్రతా సిబ్బంది సూచనలను తప్పక పాటించాలన్నారు.
జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు పలు ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అందువల్ల ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను కేటాయించటం జరిగిందని, బీచ్లు, నదీ తీరాలు, చెరువుల వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి తోపులాట్లు, అవాంతరాలు జరగకుండా సమయస్ఫూర్తి తో విధులు నిర్వర్తించాలని, భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా పట్టిష్టమైన బందోబస్తు నడుమ ప్రశాంతంగా భక్తులు దర్శనం జరిగేలా చూడాలని, పార్కింగ్ , ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు.
