మొంథా తుఫాన్ ప్రభావంతో పొలాల్లో నిలిచిన నీటి వెంటనే తొలిగించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం మార్కాపురం మండలంలోని నికరంపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, స్థానిక శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి తో కలిసి సందర్శించి దెబ్బతిన్న పత్తి పంట ను పరిశీలించారు. అనంతరం వేములకోట, మార్కాపురం చెరువులను పరిశీలించి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ.. మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ తుఫాను వలన రికార్డు స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షం నమోదు అయిందని, ఫలితంగా వాగులు, వంకల్లో ప్రవాహం పెరిగి పంట పొలాలు, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయి అన్నారు. కొన్నిచోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకే తాను క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు కలెక్టర్ వివరించారు. జియో కోఆర్డినేట్స్ ఆధారంగా నష్టాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పంట నష్ట వివరాలను అధికారులు మదింపు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పూర్తి వివరాలు రాగానే ప్రభుత్వానికి నివేదించి బాధితులకు తగిన పరిహారం వచ్చేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయటం వలన ప్రాణ నష్టాన్ని నివారించ గలిగామన్నారు. వర్షాల వలన చెరువులు పూర్తిగా నిండాయని, కొన్ని చోట్ల గండ్లు పడ్డాయన్నారు. మార్కాపురం చెరువుకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. చెరువు నీటిని సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. రోడ్ల మరమ్మతులను కూడా ప్రాధాన్యత ప్రాతిపదికగా తక్షణమే చేపట్టేలా చూస్తామన్నారు.
శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఎలాంటి విపత్తునైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని అన్నారు. మొంథా తుఫాను సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణ చేస్తూ అధికార యంత్రాంగానికి దిశ నిర్దేశం చేయటం వలన ముప్పును చాలావరకు తగ్గించగలిగామన్నారు. పంట నష్టపోయిన రైతులను సైతం పూర్తిగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కల్పించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను, రోడ్లను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. పంట నష్టాన్ని మదింపు చేసే విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని కోరినట్లు చెప్పారు. మిర్చి, పత్తి, మినుములు, అలసందలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు కలెక్టర్కు ఆయన వివరించారు. కంది కూడా చేతికి రావడంపై అనుమానం వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు అండగా నిరుద్దామని ఆయన అన్నారు.
అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, నియోజక వర్గ అధికారులతో సమావేశమై మొంథా తుఫాన్ నేపథ్యంలో దెబ్బతిన్న పంటల పరిస్థితి, రోడ్ల పునరుద్ధరణ పనుల పురోగతిపై, నష్టం అంచనాల నివేదిక రూపొందించడంపై శాఖల వారీగా సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మొంథా తుఫాన్ వలన నష్ట పోయిన పంటను ఎన్యూమరేట్ చేయడంలో ఎలాంటి పొరపాట్లుకు తావివ్వకుండా పటిష్టంగా చేపట్టాలన్నారు.
అలాగే నియోజక వర్గం పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలను పూర్తి స్థాయిలో సమగ్రంగా నివేదించాలని సూచించారు. అలాగే దెబ్బతిన్న ఇరిగేషన్ కెనాల్స్, చెరువులకు సంబంధించి నష్టం అంచనాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో గ్రామాల్లో మంచినీటి కి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మార్కాపురం ఇంచార్జి సబ్ కలెక్టర్ శివ రామిరెడ్డి, ఇరిగేషన్, ప్రాజెక్ట్స్ ఎస్ఈ లు వరలక్ష్మి, అబూత్ఆలి, ఆర్ డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఎస్ఈ లు బాల శంకర రావు, రవి నాయక్, అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, డీపీఓ వెంకటేశ్వర రావు, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


