ఇటీవలి తుఫాన్ బీభత్సంతో ధ్వంసమైన రోడ్లు , కాలువలను పునర్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును కోరారు. బుధవారం ఒంగోలులో క్యాంపు కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ జిల్లా కలెక్టర్ రాజబాబు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని తుఫాన్ బీభత్సం తో నియోజకవర్గంలో ఆస్తి నష్టం, పంట నష్టాలపై నివేదిక అందజేశారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఎన్ఎస్పి, ఆర్డబ్ల్యూఎస్ మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని, గ్రామాల వారీగా దెబ్బతిన్న రోడ్లు మరియు కాలువల తో కూడిన అంచనాలతో నివేదికను అందజేశారు. అదేవిధంగా తుఫాను బీభత్సానికి ముఖ్యంగా దర్శి ప్రాంతంలో మిర్చి, పొగాకు, పండ్లతోటలు దెబ్బతిన్నాయని డాక్టర్ లక్ష్మీ వివరించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిస్తానని, తక్షణ అవసరాలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు లక్ష్మీ వివరించారు. అత్యవసరం కింద దర్శి వాటర్ ఫిల్టర్ బెడ్లను మరమ్మత్తులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు.
ప్రకాశం జిల్లాలో మా దర్శి ప్రాంతంలో తుఫాన్ విపత్తును అధికార యంత్రాంగం మీ ఆదేశానుసారం సమిష్టిగా పనిచేసే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా ఎదుర్కోగలిగారని డాక్టర్ లక్ష్మి అధికార యంత్రాంగాన్ని ప్రశంసించారు. ఎంత పెద్ద తుఫాన్ అయినప్పటికీ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ నిరంతరం చేసిన కృషి ఫలితం ఎంతో మేలు చేసిందని ఆమె ఈ సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ అన్నారు. దర్శి ప్రాంతంలో కూడా రెవిన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బి, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ మండల సిబ్బంది, పోలీస్ సిబ్బంది సమిష్టిగా 48 గంటలకు కంటిమీద కునుకు లేకుండా పనిచేసినందుకు కలెక్టర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో తాళ్లూరు మండల టీడీపి నాయకులు ఓబుల్ రెడ్డి, మానం రమేష్ బాబు, నవులూరి విద్యా సాగర్, తదితరులు ఉన్నారు.



