ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, రెండవ రోజు
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, వ్యాన్లు మరియు ఇతర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా నిన్న జరిగిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 39 టీమ్‌లు ఏర్పాటుచేసి 1,460 వాహనాలను తనిఖీ చేయడం జరిగింది.
తనిఖీల్లో 19 వాహనాలపై కేసులు నమోదు చేయగా, సరైన పత్రాలు లేకపోవడం మరియు ఇతర లోపాల కారణంగా 9 వాహనాలను సీజ్ చేయడంతో పాటు రూ.27,500/- జరిమానా విధించబడింది.
రెండవ రోజు ఉదయం నుండి 39 టీంలతో పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పత్రాలను పరిశీలించారు.
మోటార్ వాహన చట్టం ప్రకారం, ప్రతి వాహనంలో ప్రమాదం సంభవించిన సందర్భంలో అవసరమైన అత్యవసర పరికరాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు.
ఎదైన జరగరాని ఘటన జరిగినప్పుడు అత్యవసర తలుపుల పనితీరు, గాజు బ్రేకర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు వంటివి పని చేస్తున్నాయా లేదా అనేది వాహనాలు వద్దే పోలీసు సిబ్బంది ట్రయల్ వేయడం జరుగుతుంది.
అంతేకాకుండా, ప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో బస్సు డ్రైవర్లు ప్రజలను ఎలా రక్షించాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలపై పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు.
అదేవిధంగా, ప్రమాదాలను నివారించడం మాత్రమే కాకుండా, ప్రమాదం జరిగినప్పుడు లారీ, బస్సు, వ్యాన్ డ్రైవర్లు తాము మరియు ప్రయాణికులు సురక్షితంగా బయటపడే విధానం గురించి నిపుణుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
వాహనం నడిపే ముందు మీ కుటుంబాన్ని గుర్తు చేసుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు అని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే, ఆ కుటుంబాలు ఎదుర్కొనే బాధను ప్రతి డ్రైవర్ గుర్తు చేసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశమే ఉండదన్నారు.
ప్రతి ఒక్కరూ వాహనం నడుపుతున్న సమయంలో సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి, అలా ధరించడం ద్వారా ప్రమాదం సంభవించినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకుని ప్రాణాలను రక్షిస్తాయన్నారు.
ఇదిలా ఉంటే, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడరాదని ఆయన హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి.. మీరే యమపురికి దారి వెతుకొవద్దని ఎస్పీ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజల మరియు విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

