హైదరాబాద్: నవంబర్ 6: (జే ఎస్ డి ఎం న్యూస్)
దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో ఉందని ఆ స్థాయిని నిలుపుకోవలసిన బాధ్యత ప్రొబేషనరీ డిఎస్పీల పైన కూడా ఉందని డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి అన్నారు.
ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో గురువారం నాడు జరిగిన ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్ల శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి డిజిపి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్ ,టీజీ సీఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్, పోలీస్ కమిషనర్లు వి. సి .సజ్జనార్ (హైదరాబాద్), సుధీర్ బాబు(రాచకొండ), అవినాష్ మహంతి(సైబరాబాద్) తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో ప్రొబేషనరీ డిఎస్పీలనుఉద్దేశించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గురువారం ప్రసంగించారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ పోలీస్ కుటుంబంలోకి అడుగుపెడుతున్న 112 మంది ప్రొబేషనరీ డిఎస్పి లతొ కూడుకున్న అతి పెద్ద బ్యాచ్ ఇదేనని వెల్లడించారు. రానున్న పది నెలల శిక్షణ కాలం మీ నాయకత్వ పయనానికి అకాడమీ పునాది వేస్తుందని, ఈ అకాడమీ వాతావరణం మీలో క్రమశిక్షణ, సమయపాలన, దృక్పథంలో మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. డిజిపి మాట్లాడుతూ.పోలీస్ అధికారి కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా దాని ఆత్మను అర్థం చేసుకోవాలని, నిష్పాక్షికత, ఓర్పు, సహానుభూతి వంటి విలువలే ఒక అధికారిని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. ప్రజలు మిమ్మల్ని అధికారులుగా కాదు న్యాయప్రతినిధులుగా చూస్తారని చెప్పారు.
శిక్షణ కఠినమైనదే అయినా ప్రతి క్రమశిక్షణా చర్యలో ఒక అర్థం ఉందని, డ్రిల్, వ్యాయామం, సమిష్టి కృషి ఇవన్నీ మీలో ఆత్మనిగ్రహం పెంచుతాయని ప్రొబేషనరీ డిఎస్పి లకు వివరించారు. క్రమశిక్షణ అంటే శిక్ష కాదు, సంసిద్ధత అని స్పష్టం చేశారు.
గ్రేహౌండ్స్, ఆక్తోపస్, సీఐ సెల్, టిజీసీఎస్‌బీ, ఈగిల్ వంటి ప్రత్యేక సంస్థల ద్వారా తెలంగాణ పోలీస్ ఆధునిక పోలీసింగ్‌లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్, భరోసా సెంటర్స్, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలకు నిదర్శనాలని తెలిపారు.
ఈ బ్యాచ్‌లో 38 మంది మహిళా అధికారులు ఉండటం గర్వకారణమని, తెలంగాణ పోలీస్ భవిష్యత్తు మీరే అని అన్నారు. గౌరవం, సమానత్వం ఇక్కడి నుంచే ప్రారంభమవ్వాలని సూచించారు.నాయకత్వం అధికారంతో ప్రారంభమవదని, మీ ప్రవర్తన, నిజాయితీ, సహానుభూతి, సహచరుల పట్ల సానుకూలత ఇవే నిజమైన నాయకత్వ లక్షణాలని అన్నారు. ఇతరులను నడిపించాలంటే ముందుగా సేవ నేర్చుకోవాలని సూచించారు.తెలంగాణ ప్రజలు తమ పోలీసులపై అపార విశ్వాసం కలిగి ఉన్నారని, ఆ విశ్వాసం మనం సంపాదించుకున్నదని, ‘సేవతో గౌరవం పొందడం’ మన నినాదమని తెలిపారు. యూనిఫాం ధరించే ప్రతి సారి ఆ విలువలు మీ ప్రవర్తనలో ప్రతిఫలించాలన్నారు.
ప్రొబేషనరీ అధికారులకు మూడు ప్రాథమిక విలువలను పాటించాలని సూచించారు — నిజాయితీ, సహానుభూతి, వృత్తి నైపుణ్యత. ఎవరూ చూడని వేళల్లో కూడా సత్యనిష్ఠగా ఉండాలని, పౌరుడి భావనను అర్థం చేసుకోవాలని, పనిలో ప్రావీణ్యం సాధించాలని తెలిపారు.పోలీస్ అధికారికి నిజమైన అధికారం యూనిఫాం మీద ఉన్న నక్షత్రాల వల్ల రాదనీ,ప్రజల కళ్లలో కనిపించే విశ్వాసం వల్ల వస్తుందని చెప్పారు. భద్రత, గౌరవం, న్యాయం, వృత్తి నైపుణ్యతకు ప్రతీకలుగా నిలవాలని ఆకాంక్షించారు.
డిజిపి తన ప్రసంగం ముగింపు సందర్భంగా “విధి నిర్వహణతో గౌరవం, సత్యనిష్ఠతో నాయకత్వం, కరుణతో రక్షణ కల్పించేలా శిక్షణ పొందాలన్నారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్ మాట్లాడుతూ. పది నెలపాటు జరగనున్న శిక్షణ కార్యక్రమానికి సంసిద్ధులై ఉండాలని అన్నారు. మొదటి దశలో 42 వారాలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా సిలబస్ కాపీలను డిజిపి ఆవిష్కరించారు. శిక్షణ పొందుతున్న ట్రైనీలు వారి అనుభవాలను పంచుకున్నారు. ఐజిపిలు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఎం .రమేష్, రమేష్ నాయుడు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు ఎన్.వెంకటేశ్వర్లు , మురళీధర్ , జి కవిత తదితరులు శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
