జూబ్లీ హిల్స్ నవంబర్ 11(జే ఎస్ డి ఎం న్యూస్) :
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి పర్యవేక్షించారు. మంగళవారం సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని శాస్త్రి నగర్, బంజారా నగర్, ఛత్రపతి శివాజీ నగర్, ఓల్డ్ సుల్తాన్పూర్, ప్రేమ్ నగర్లలో ఉన్న పలు పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా సందర్శించి పోలింగ్ సరళినిపరిశీలించారు.
అంతేకాకుండా,సైబరాబాద్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు అమర్చిన 19 సీసీటీవీల ద్వారా రియల్ టైమ్ లొకేషన్ వ్యవస్థతో ఎప్పటికప్పుడు పోలింగ్ సరళి పనితీరును సీపీ మొహంతి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సీపీ మొహంతి మాట్లాడుతూ. ప్రతి ఎన్నికల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. ఎన్నికల బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలు, సిబ్బంది డిప్లాయ్ మెంట్, కేంద్ర బలగాలతో సమన్వయం తదితర అన్ని అంశాలపై కృషి చేసిన సంబంధిత అధికారులను ఆయన అభినందించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్‌లో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీపీ అధికారులను ఆదేశించారు. నివాసాలలో, హోటళ్లు, లాడ్జీలలో స్థానికేతరులు బస చేయకుండా చూడాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అధికారులతో మాట్లాడుతూ సీపీ మొహంతి పలు అంశాల గురించి వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తుఏర్పాటుచేయడంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటుహక్కునువినియోగించుకునేలా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు కోసం భద్రత కల్పించాలని ఉద్ఘాటించారు. ఈ విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వల్ల ఎన్నికల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీపీ అవినాష్ మొహంతి వెంట బాలానగర్ ఇంచార్జ్ డీసీపీలు కోటి రెడ్డి, రవి కుమార్, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


