రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని పీసీ పల్లి మండలంలోని గుంటూరు లింగన్నపాలెం గ్రామంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల ( ఎం ఎస్ ఎం ఈ ) పార్కు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
తదనంతరం, ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించి, ఏర్పాటు చేసిన సభావేదికలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం విజయవంతంగా పర్యటనను ముగించి బయలుదేరారు. పర్యటనకు ముందు, హెలిప్యాడ్, వి.ఐ.పి. రూట్, సభా వేదిక మరియు పార్కింగ్ ప్రాంతాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వేదిక, హెలిప్యాడ్ మరియు ప్రధాన మార్గాలపై సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. బందోబస్తు విజయవంతంగా పూర్తి చేసినందుకు సభావేదిక, రూట్ మరియు ట్రాఫిక్ బాధ్యతలు నిర్వహించిన అధికారులు, బందోబస్తు సిబ్బందిని అభినందించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా పూర్తైందని తెలిపారు.

