హైదరాబాద్ నవంబర్ 14(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో జరుగుతున్న సీఎం ప్రజావాణి ని మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 24 మంది డిప్యూటీ కలెక్టర్స్ సందర్శించారు.శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రజావాణి పనితీరును మధ్య ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ పరిశీలించారు.
సీఎం ప్రజావాణి ప్రజల సమస్యలను పరిష్కారంలో తీసుకుంటున్న చర్యలు, ప్రజల కోసం అమలు చేస్తున్న పంథాను స్ఫూర్తిగా తీసుకుని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే తరహా కార్యక్రమాన్ని అమలు చేస్తామని డిప్యూటీ కలెక్టర్స్ ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారి తెలిపారు. ఈ సందర్బంగా సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లతో వారు భేటీ అయ్యారు. సీఎం ప్రజావాణి అమలు తీరును, ప్రజల సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న వైఖరిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చిన్నారెడ్డి, దివ్య డిప్యూటీ కలెక్టర్స్ కు వివరించారు. పలు అంశాలను వారు అడిగి తెలుసుకున్నారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని 24 మంది డిప్యూటీ కలెక్టర్స్ సీఎం ప్రజావాణిని సందర్శించి ఇక్కడి అనుభవాలతో తమ రాష్ట్రంలోనూ ఇదే తరహా పద్ధతిని అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతామని డిప్యూటీ కలెక్టర్స్ తెలిపారు.

