బాల్య న్యాయ చట్టం, పోక్సో చట్టం, పిల్లలకు సంబంధించిన ఇతర చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు, పిల్లలతో వ్యవహరించే బాలల సంక్షేమ పోలీస్ అధికారులు, మహిళా సహాయక కేంద్రం సిబ్బంది, శక్తి టీమ్స్, జిల్లా ఏ హెచ్ టి యు బృందంతో ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015, బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ వంటి కీలక చట్టాలపై పోలీస్ సిబ్బంది మరింత అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఈ చట్టాల ప్రకారం పాటించాల్సిన నియమాలను తెలుసుకోవడం, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. బాధిత బాలబాలికలకు న్యాయం చేయడంలో చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు బస్టాండులు, ఆర్టీసీ కాంప్లెక్సులు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్ళు, ఈవ్ టీజింగ్ జరిగే ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలల వద్ద పర్యటిస్తూ ఏ సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా పని చేయాలని ఎస్పీ సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి యాప్ యొక్క ప్రాముఖ్యత, అందించే సేవల గురించి విస్తృత అవగాహన కల్పించాలని, ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించాలన్నారు. శక్తి కాల్స్, డయల్ 100/112, ఉమెన్ హెల్ప్ లైన్ -181 ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీసులు చురుకుగా స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.
శక్తి టీమ్ ఏర్పాటుచేసినప్పుడు నుండి 3000 పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 813 ఎస్ ఓ ఎస్ కాల్స్ కు వెంటనే స్పందించటం జరిగిందని, ఇంకా ఎక్కువ డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తూ స్కూల్/కాలేజీ ల వద్ద విజిబుల్ పోలీసింగ్ చేస్తూ శక్తి యాప్ గురించి తెలియచేస్తూ ఎక్కువగా అవగాహనా కల్పిస్తూ మహిళలు మరియు చిన్నపిల్లలు జరిగే నేరాలను నివారించడంలో కృషి చేయాలని సూచించారు. రెస్పాన్స్ టైమ్ అత్యంత కీలకమన్నారు. బాధితులకు అండగా నిలిచి, సమాజం గుర్తుంచుకునే విధంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ యస్.సువర్ణ, సిడిపిఓ పి.ఇవాజింలెన్, డిసిపిఓ పి.దినేష్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి. రమణ కుమార్, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యు.సుధాకర్, ఎస్సైలు, పోలీస్ , ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.


