ప్రజలతోపాటు విద్యార్థులకు సురక్షిత మంచినీటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది -జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు- సురక్షిత తాగునీటిపై సమీక్ష

ప్రజలతో పాటు విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత త్రాగునీరు అందించాల్సిన భాద్యత సంబంధిత అధికారులపై వుందని, అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఆర్డబ్ల్యూఎస్. శాఖ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, పంచాయతీ రాజ్, సంక్షేమ వసతి గృహాల అధికారులు, విద్యా శాఖ అధికారులతో సమావేశమై ప్రజలకు, విద్యార్ధులకు సురక్షిత త్రాగునీరు అందించేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి, దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలతో పాటు విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత త్రాగునీరు అందించాల్సిన భాద్యత సంబంధిత అధికారులపై వుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన త్రాగునీరు అందించడంలో ఖర్చు చేస్తున్నదన్నారు. గ్రామాన్ని/మున్సిపాలిటీని యూనిట్ గా తీసుకుని ఎంత మంది ప్రజలు నివశిస్తున్నారు, త్రాగునీటి వనరుల లభ్యత ఎక్కడినుండి వస్తున్నది, అలాగే ఎన్ని బోర్లు పనిచేస్తున్నాయి, ఆ నీటి లో ప్లోరైడ్ శాతం ఎంత వుంది, అలాగే ఎన్ని ఆర్ఓ ప్లాంట్స్ పనిచేస్తున్నాయి, ఆ ఆర్ఓ ప్లాంట్స్ కు నీటి వనరుల లభ్యత ఎక్కడినుండి వస్తున్నది తదితర వివరాలతో సమగ్ర నివేదికతో పాటు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసి రెండు మూడు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్., మున్సిపల్ కమీషనర్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్.సి., ఎస్.టి., బిసి వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యాలయాల్లో ఎంత మంది విద్యార్ధులు ఉంటున్నారు, వాటికి నీటి వనరుల లభ్యత ఎక్కడినుండి వస్తున్నది, ఎన్ని ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిలో ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పనిచేయడం లేదు, ఏ కారణంగా అవి పనిచేయడం లేదు తదితర వివరాలతో సమగ్రంగా నివేదిక తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంక్షేమ వసతి గృహాల అధికారులను మరియు విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఉన్న ఆర్ ఓ ప్లాంట్స్ నిర్వహణ పై రెగ్యులర్ పర్యవేక్షణ ఉండేలా కార్యాచరణ ప్రణాళికలు రుపొందించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై ప్రతి వారం సమావేశమై సమీక్షించుకోవడం జరుగుతుందని, అందుకనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాల్సిఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సి.ఈ.ఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వర రావు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్.ఈ బాల శంకర రావు, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మా నాయక్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంజయ్ కుమార్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఎపిఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ డిసిఓ జయ, జిల్లాలోని మున్సిపల్ కమీషనర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *