బాలల దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని సోనియా గాంధీ నగర్ అంగనవాడి స్కూల్ చిన్నారులు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారితో ఆప్యాయంగా ముచ్చటించి, చాక్లెట్లు పంచి, చిన్నారులతో కరచాలనం చేయడంతో వారిలో అవధుల్లేని ఆనందం వ్యక్తమైంది. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన ఎక్కడికి వెళ్లినా పిల్లలను సమీపించుకుని వారితో ముచ్చటించేవారన్నారు. నెహ్రూ మంచి విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, ప్రధానిగా దేశానికి విశేష సేవలు అందించారని, భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. 1964లో నెహ్రూ మరణించిన అనంతరం ఆయన పుట్టిన రోజైన నవంబర్ 14న ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పిల్లలు ఏ కుటుంబానికైనా, సమాజానికైనా, దేశానికైనా మూలస్తంభాలన్నారు. వారికి ప్రేమ, భద్రత, మంచి విద్య, విలువలు నేర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. నేటి బాలల చేతుల్లోనే రేపటి భారత భవిష్యత్తు ఉందని, పిల్లల అభివృద్ధికి మంచి విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, ధైర్యం ఎంతో అవసరమన్నారు. చిన్నారులకు సురక్షితమైన వాతావరణం, ప్రేమ, ప్రోత్సాహం లభిస్తే వారు ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు.
చదువు, క్రీడలు, సృజనాత్మకత అన్ని స్థాయిలో ఎదగటం ద్వారా వారు మంచి పౌరులుగా మారతారన్నారు. విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా, వాటిలో నిష్ణాతులుగా ఎదిగేందుకు ప్రయత్నం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పిల్లల హక్కులను కాపాడటం, వారి బాల్యాన్ని రక్షించడం ప్రతి కుటుంబం మరియు సమాజం భాద్యతని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఆర్ఐ సీతారామిరెడ్డి, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ జ్యోతి, తల్లిదండ్రులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


