సమగ్ర ప్రణాళిక, సమన్వయం, సమర్థ పర్యవేక్షణతో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు -జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

   సమగ్ర ప్రణాళిక, సమన్వయం, సమర్థ పర్యవేక్షణతో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
అన్నారు. మొంథా తుఫాను సమయంలో జిల్లా యంత్రాంగం స్పందించిన తీరే దీనికి నిదర్శనమని చెప్పారు. తుఫాను సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చురుకుగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాల ప్రదానోత్సవం శనివారం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో జరిగింది. కలెక్టర్ తో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విపత్తుల సమయంలో ఎదురైన పరిస్థితులను, అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ తుఫాను సమయంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు పనిచేయటం వలన జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ‘ ప్రజల నుంచి ప్రశంసలు పొందడంతో పాటు మీ బిడ్డలకు కూడా స్ఫూర్తిగా నిలిచారు. ఇదే స్ఫూర్తిని ఇకముందు కూడా విధుల నిర్వహణలో చూపి ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలి ‘ అని పిలుపునిచ్చారు.
ఎస్పీ మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ విభాగాల మధ్య మంచి సమన్వయం ఉండటం వలన క్షేత్రస్థాయి ఉద్యోగులు సకాలంలో స్పందించి పరిస్థితిని త్వరగా చక్కదిద్దినట్లు చెప్పారు. ముఖ్యంగా కొండేపిలో ఎస్సై చురుకుగా వ్యవహరించి 121 మంది పొగాకు కూలీలను ఎస్.డీ.ఆర్.ఎఫ్. బృందం సహాయంతో సురక్షితంగా తరలించడాన్ని
ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. విపత్తుల సమయంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విపత్తులు, ఎన్నికల నిర్వహణ సమయంలో స్పందించిన తీరే ప్రభుత్వ యంత్రాంగ సామర్ధ్యానికి నిదర్శనంగా ఉంటుందన్నారు. తాజా తుఫాను సమయంలో జిల్లా యంత్రాంగ శక్తి సామర్థ్యాలు నిరూపితమయ్యాయి అన్నారు. దీనిని ఒక అనుభవంగా తీసుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా మరింత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
డిఆర్ఓ బి.చిన ఓబులేసు మాట్లాడుతూ కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ పరిస్థితిని నిశితంగా నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయటం వలన ప్రజలకు సేవలు, బాధితులకు పరిహారం అందించడంలో ఎవరి నుంచీ ఎలాంటి విమర్శలు రాలేదన్నారు.
అనంతరం జాయింట్ కలెక్టర్, డి.ఆర్.ఓ, ఆర్డీవోలతో పాటు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు, సిబ్బందిని కలెక్టర్, ఎస్పీ సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు. పలువురు జిల్లాస్థాయి అధికారులు, తహసిల్దార్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *