పి 4 ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో పి4, స్వర్ణాంధ్ర విజన్, జిల్లాలో ప్రాథమిక, ద్వితీయ,తృతీయ రంగాలలో సాధించిన వృద్ధి, సాధించవలసిన అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. ప్రాథమిక వ్యవసాయ రంగంలో జిల్లాలో సాధించిన వృద్ధి గణాంకాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఇంకా సాధించవలసిన అభివృద్ధిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, జీవాల పెంపకంపై ఔత్సాహిక రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువుగా తీసుకుపోయి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. సేవల రంగం, పారిశ్రామిక రంగంపై అధిక దృష్టి కేంద్రీకరించి యువతను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలన్నారు. చిన్న పరిశ్రమల స్వయం ఉపాధి దిశగా ఆదాయ వనరులుగా మారుతాయన్నారు. జిల్లాలో ఉన్న బంగారు కుటుంబాల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే వారిని ప్రోత్సహించాలని గ్రామాలను, మండలాలను దత్తత తీసుకునే విధంగా దాతలను ప్రోత్సహించాలన్నారు. మండలాల స్థాయిలో సాధించిన అభివృద్ధి వివరాలతో పాటు గ్రామపంచాయతీ సచివాలయాల పరిధిలో సాధించిన అభివృద్ధి వివరాలను సమగ్రంగా సేకరించాలన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్దవంతంగా వినియోగించుకుని ప్రజలు సర్వోన్నత ముఖాభివృద్ధి సాధించే విధంగా వారిని చైతన్యవంతుల్ని చేయలన్నారు. ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
