ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రతివారం నిర్వహించే మీకోసం కార్యక్రమం ద్వారా వచ్చిన వినతిని తక్షణమే పరిష్కరించి తమ నిబద్ధతను చాటారు.
నాగంపల్లి గ్రామం, కొనకనమిట్ల మండలం, ప్రస్తుతం నివాసం పోదిలి టౌన్ నివాసం ఉంటున్న 80 సంవత్సరాల వృద్ధురాలు
బూదాల మాణిక్యం @ మానెమ్మ స్పందన ద్వారా జిల్లా ఎస్పీ కి తన మనవడు కొట్టాడని, తన డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని తన సమస్యలను పరిష్కరించమని కన్నీటిపర్యంతమయ్యారు.
80 సంవత్సరాల వృద్ధురాలి ఫిర్యాదు జిల్లా ఎస్పీ ని కదిలించింది.
జిల్లా ఎస్పీ ఈ సమస్యను ప్రత్యేక చొరవ తీసుకొని వృద్ధురాలికి తక్షణమే భద్రత కల్పించాలని, ఆర్థిక వివాదాన్ని పరిష్కరించాలని, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, పొదిలి సీఐ ఎం.రాజేష్ కుమార్ కి పలు సూచనలు చేశారు. వృద్ధురాలి సమస్యపై వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పొదిలి సీఐ ఎం. రాజేష్ కుమార్ సిబ్బందితో కలిసి వెంటనే వృద్ధురాలి స్వగ్రామానికి వెళ్లి ఫిర్యాదురాలిపై ఆమె మనవడు బూదాల మెస్సీ ఉరఫ్ మెషాక్ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకుని, అతడిని గట్టిగా మందలించారు. ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మాణిక్యం వయసు ఎక్కువగా ఉన్నందున సీనియర్ సిటిజన్ రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడునని కౌన్సిలింగ్ నిర్వహించారు.
మాణిక్యం పేరు మీద 4 ఎకరాలు భూమి ఉన్నందున, ఆమె బ్రతుకుదెరువుకోసం ఆమెకి నచ్చిన వారికి కౌలుకి ఇచ్చుకొనే అధికారం ఆమెకే ఉందని, ఈ విషయం లో ఆమె కొడుకు బుడాల శాంసన్ మరియు మనవడు బూదాల మెస్సీ అనవసరంగా జోక్యం చేసుకోవద్దని, పొదిలి సీఐ సూచించారు.
వృద్ధురాలైన మానెమ్మ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆమె స్వగ్రామమైన నాగంపల్లిలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇల్లు కల్పించే విషయంపై కొనకనమిట్ల మండల తహశీల్దార్ తో పొదిలి సీఐ మాట్లాడారు. వృద్ధురాలు నివసించేందుకు త్వరలో ఒక ఇంటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఈ విధంగా, కేవలం 24 గంటల్లోపే జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో, వృద్ధురాలి కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదం పరిష్కారమయ్యాయి. వృద్ధురాలి సమస్యను మానవతా దృక్పథంతో తక్షణమే పరిష్కరించిన జిల్లా ఎస్పీ కి, అలాగే సీఐ కి ఆమె మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కరోజులోనే వృద్ధురాలి సమస్యలను తీర్చేందుకు ముందుకు వచ్చిన జిల్లా ఎస్పీ మానవీయ ధోరణిని స్ధానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
వృద్ధులు, మహిళలు, చిన్నారులపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా చర్యలు తీసుకుంటామని, అలాగే శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
