ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు మరియు మెరైన్ పోలీసులు సంయుక్తంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్రతీర భద్రతను పరీక్షించడం, ఉగ్రవాద దాడుల సమయంలో భద్రతా వ్యవస్థల ప్రతిస్పందన సామర్థ్యాన్ని అంచనా వేయడం లక్ష్యంగా సాగర్ కవాచ్ పేరిట రెండు రోజులపాటు తీర భద్రతా వ్యాయామాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా సముద్రతీర ప్రాంతంలో మొత్తం 112 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు మరియు మెరైన్ పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్‌గా ఉన్నారు.
ఉగ్రవాద కదలికలకు సంబంధించి సమాచారం సేకరించడం, సముద్ర మార్గంలో చొరబాట్లను అడ్డుకోవడం, అనుమానాస్పద వస్తువులను గుర్తించడం, మరియు చొరబాటుదారులను విచారించడం వంటి కీలక దశల్లో ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. పోలీసు బృందాలు ఈ మాక్ డ్రిల్ లో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో పటిష్ట బందబస్తును నిర్వహిస్తూ, వాహన తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు.
నవంబర్ 20 మరియు 21 తేదీల్లో జరిగే ఈ మాక్ డ్రిల్ లో ఉగ్రవాదులుగా వ్యవహరించే బృందం తీరప్రాంతంలోకి చొరబడే ప్రయత్నం చేస్తే, వారిని సమర్థవంతంగా అడ్డుకోవాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు.


