ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటి కోర్ ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్వరరావు ఒంగోలులోని సత్యనారాయణపురం, వెంకటేశ్వరనగర్ ప్రాంతాలలో జన్ శిక్షణ సంస్థాన్ ఉపాధ్యాయులకు ప్రత్యేక సైబర్ భద్రత అవగాహన శిక్షణ అందించారు.
సైబర్ నేరాలపై అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సైబర్ నేరాల గురించి తెలియజేయాలన్నారు. చదువుకోని వారు, చదువుకున్నవాళ్ళు కూడా ఇద్దరూ సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోతున్నారన్నారు. ఫేక్ ఎస్ఎంఎస్ లు, ఓటీపీ మోసాలు, బ్యాంకు నుండి అని ఫోన్లు, వాట్సప్‌ల ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్ యాప్స్, మీ కేవైసీ పెండింగ్ అని జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ అనగా పోలీస్, సిబిఐ, వివిధ ఉన్నత శాఖల అధికారులంటూ ఫోన్ చేసి డబ్బులు వసూలు చేయడం, కొరియర్ పేరుతో మోసాలు, లోన్ యాప్, హనీ ట్రాప్, లాటరీల పేరుతో మోసాలు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్టు మోసాలు, తక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే అధికంగా డబ్బు ఇస్తామని, వీడియోకాల్స్ చేసి స్క్రీన్ రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్ మరియు తదితర సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రజలు మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ శిక్షణతో ఉపాధ్యాయులు గ్రామీణ శిక్షణార్థులకు, యువతకు మరియు విద్యార్థులకు డిజిటల్ భద్రతపై మార్గదర్శకత్వం అందించనున్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఏ.శివకృష్ణారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
