ప్రకాశం జిల్లాలో సాగే సాగర్ కవచ్ బందోబస్తు కార్యక్రమం నేపధ్యంలో ఒంగోలుకు విధి నిర్వహణ కోసం వచ్చిన పెద్దారవీడు పోలీ్స్ స్టేషన్‌కు చెందిన హోమ్ గార్డ్ షేక్ యాసిన్ ( హెచ్ జి–312), దోర్నాల పి.ఎస్.కి చెందిన తంగిరాల ప్రశాంత్ కుమార్ ( హెచ్ జి–355), వెలిగండ్ల పి.ఎస్.కి చెందిన చెరుకూరి బాల సుబ్రహ్మణ్యం ( హెచ్ జి–46) ముగ్గురు 19 రాత్రి ఒంగోలులోని అన్నపూర్ణ లాడ్జ్‌లో విశ్రాంతి కోసం గదిని తీసుకున్నారు.
అనంతరం ముగ్గురు కలసి మద్యం తాగి, సిగిరెట్ కాల్చే సమయంలో ప్రశాంత్ కుమార్ మరియు బాల సుబ్రహ్మణ్యం ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి, పరస్పరం తోసివేసుకోవడం, చేతులతో కొట్టుకునే సంఘటన చోటుచేసుకుంది. గొడవ సమయంలో, బాల సుబ్రహ్మణ్యం కిందపడటం వల్ల తలకు గాయమైనది.
ఈ విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు వెంటనే అధికారులను విచారణకు ఆదేశించారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు క్రమశిక్షణను పాటించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేస్తూ, ఈ ఘటనపై సమగ్ర రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు.
ప్రాథమికంగా ముగ్గురు హోమ్ గార్డులను జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించి విచారణ కొనసాగుతోంది. ప్రశాంత్ కుమార్ మరియు బాల సుబ్రహ్మణ్యలను విధుల నుండి తాత్కాలికంగా నిలిపివేయటం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతుంది.
పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది, హోమ్ గార్డులు సహా ప్రతీ ఒక్కరూ విధులు నిర్వర్తించే సమయంలో క్రమశిక్షణ, ప్రవర్తనా నియమాలను కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా, శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, వారిపై చర్యలు తీసుకోబడతాయని, హోమ్ గార్డులు కూడా పోలీస్ వ్యవస్థలో ఒక భాగమనే జిల్లా ఎస్పీ గారు అన్నారు.