రాష్ట్రానికి కీలక ఆదాయ వనరుగా మత్స్య సంబంధ కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమాత్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామిచెప్పారు. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో ఘనంగా జరిగాయి. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు జి.పేరయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆర్. వెంకట్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్స్య ఆదాయం ఆర్జనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆక్వా కల్చర్ లో
ఒక్కో యూనిట్ రూ.1.5 చొప్పున విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యం ఇసన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని వారి భూములను ప్రభుత్వం వెనక్కి ఇచ్చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మత్స్యకార సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మత్స్యకారులకు పిలుపునిచ్చారు. ఆక్వా రంగంలో మరింత మంది అధ్యయనం చేసేలా కాలేజీలలో వినూత్న కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ఉన్న విశాల తీరప్రాంతాన్ని ఆదాయంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు తమ ఆదాయం పెంచుకునేందుకు ఉత్తమ విధానాలను పాటించాలని కలెక్టర్ సూచించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తీర ప్రాంతం వెంట చేపట్టిన పర్యాటక, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో ధరలను కూడా మత్స్యకారుల సమక్షంలోనే ఖరారు చేశామని గుర్తు చేశారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రస్తావించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక కట్టుబాటుకు మత్స్యకారులు ప్రతిరూపంగా ఉంటున్నట్లు చెప్పారు. వేట నిషేధ సమయంలోనూ, ఇతర విపత్తులలోనూ ఈ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు తాజాగా వచ్చిన మొంథా తుఫాన్ సమయంలోనూ మరిన్ని నిత్యవసర సరుకులను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బాధితులందరికీ పూర్తిస్థాయిలో పరిహారం అందేలా
చూస్తామని స్పష్టం చేశారు. ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంచడాన్ని ఆయన ప్రస్తావించారు. పల్లెపాలెంలో త్వరలోనే ఫిషింగ్ హార్బర్ పనులు కూడా మొదలు పెడతామని చెప్పారు. మత్స్యకారులకు ఉపయోగపడేలా జెట్టీ కూడా కట్టామన్నారు. మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, డీజిల్ కు ఇస్తున్న సబ్సిడీని కూడా పెంచేలా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ప్రకటించారు. మడనూరు – గుండమాల బీచ్ రోడ్డును సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు. స్థానిక మత్స్యకారులకు తమిళనాడు మత్స్యకారుల నుండి ఎదురవుతున్న సమస్యను పరిష్కరించేలా గత ఏడాదే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు లేఖ రాసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మత్స్యకారులకు ఇళ్ల స్థలాల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మేయర్ మాట్లాడుతూ మత్స్యకారులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి కోసం అమలు చేస్తున్న పథకాలే దీనికి నిదర్శనం అని చెప్పారు.
జి. పేరయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఇస్తున్న సబ్సిడీని పెంచాలని కోరారు. రాయితీ డీజిల్ ను
300 లీటర్ల నుంచి 600 లీటర్లకు పెంచాలని కూడా ఆయన అభ్యర్థించారు.
ఆర్. వెంకట్రావు, శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయరత్నం, పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ ఫిషరీస్ రంగంలో ఉన్న అభివృద్ధి అవకాశాలు, ప్రభుత్వం నుంచి కావాల్సిన తోడ్పాటును వివరించారు.
ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల విలువైన బ్యాంకు చెక్కును ఈ కార్యక్రమంలో అతిధులు అందించారు. పదిమంది మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు, ఐదుగురికి జిపిఎస్ సెట్లు, ఇద్దరికి పడవలు,
ఇంజిన్లు, వలలను కూడా ప్రదానం చేశారు.




