వారిద్దరూ మంచి స్నేహితులు.. ఒకరు ప్రధానోపాధ్యాయుడు.. మరొకరు విశ్రాంత హెచ్ఎం.. ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళుతుంటారు.. రోడ్డు ప్రమాదంలో గంటల వ్యవధిలోనే మృత్యువాతకు గురయ్యారు. సీఐ ఎ. సుబ్బరాజు అందించిన సమాచారం మేరకు.. అద్దంకి మండలం మోదేపల్లికి చెందిన దాసరి నరసయ్య(58) తాళ్లూరు మండలం తురకపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వెంపరాల గ్రామానికి చెందిన గోసాల శ్రీనివాసరావు(58) ఇంకొల్లు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం అద్దంకిలో నివసిస్తున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. శనివారం ఉదయం అద్దంకి నుంచి వెంపరాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. భోజనం అనంతరం తిరిగి అద్దంకి వస్తున్నారు. శాంతినగర్ వద్ద నామ్ రహదారిపై మలుపు తిరిగే క్రమంలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న కారు వీరి బండిని ఢీకొంది. దీంతో ఇద్దరూ ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. నరసయ్య తలకు తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. స్థానికులు గాయపడిన శ్రీనివాస రావును ఆటోలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మద్దిపాడు సమీపంలోకి వెళ్లగానే మరణించారు. ఆ మేరకు రెండు మృత దేహాలను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రి
మార్చరీకి చేర్చారు. మిత్రులిద్దరూ ప్రమాదంలో కన్నుమూయడం బాధాకరమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.



