హైదరాబాద్, నవంబర్ 26:
(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను అందించాలనే లక్ష్యంతో జిహెచ్ఎంసి సాధారణ సమావేశం మంగళవారం ముఖ్యమైన తీర్మానం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక్కో వార్డు/డివిజన్‌కు రూ.2 కోట్లు నిధులనుకేటాయిస్తూ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.ఈ బడ్జెట్ కేటాయింపులో భాగంగా:
•రూ.1 కోటి కార్పొరేటర్ ప్రత్యక్షంగా ప్రతిపాదించే పనులకు ,రూ.1 కోటి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రితో సమన్వయం చేస్తూ కార్పొరేటర్ ప్రతిపాదించే పనులకు మంజూరు చేయనున్నట్లు జిహెచ్ఎంసి స్పష్టంచేసింది.ఈ నిధులను రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి కాల్వలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ సౌకర్యాల అభివృద్ధి వంటి అత్యవసర పౌర సదుపాయాల మెరుగుదలకువినియోగించాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి.ఈ సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్ అభివృద్ధి, ప్రజల అవసరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను పారదర్శకంగా వినియోగిస్తామని తెలిపారు. నగర అభివృద్ధి పట్ల జీ హెచ్ ఎం సి కట్టుబాటును ప్రతిబింబించే కీలక నిర్ణయమిదని ఆమె పేర్కొన్నారు.ఆమె మాట్లాడుతూ, తార్నాక డివిజన్‌ను ఒక మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దడంలో ఈ బడ్జెట్ ఎంతో దోహదం చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంతోనే ఈ బడ్జెట్‌కు సాంక్షన్ ఇవ్వడం వల్లనే ఈ కేటాయింపు సాధ్యమైందని డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. పౌరసమస్యలను త్వరితగతిన పరిష్కరించి అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
