భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం ఒంగోలు నగరంలోని హెచ్.సి.ఎం సెంటర్ వద్ద గల డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, ఎపి మాల కార్పోరేషన్ చైర్మన్ డా. విజయ కుమార్, జాయింట్ కలెక్టర్
ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ల తో కలసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మీడియా తో మాట్లాడుతూ, ఈ రోజు భారతీయులంతా గర్వపడే రోజున్నారు. దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన
సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. బ్రిటీష్ వారు మన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన తరువాత మనం స్వయంగా పరిపాలన సాగించుకోవడానికి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగంగా కొనియాడబడుతున్న భారత రాజ్యాంగాన్ని ఈ రోజు భారత దేశ పౌరలంతా స్మరించుకోవడం జరుగుచున్నదన్నారు. డా బి ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి, మన దేశంలోని సాంస్కృతిక, భాషల, తదితర వైవిధ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలని సూచించారు. అత్యున్నత రాజ్యాంగం యొక్క గొప్పదనం ప్రతీఒక్కరికీ తెలియాలన్న ఉద్దేశంతో నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతీఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ప్రతీ పౌరుడు మన రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, మాట్లాడుతూ, 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. అందుకే నవంబర్ 26న ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఎన్నో కులాలు, మతాలు కలిగిన భారత దేశంలో అందరికి సమాన హక్కులు కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందించి, అందరికీ ప్రేరణగా నిలిచారన్నారు.
ఈ సందర్భంగా విద్యార్ధులతో కలసి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఎస్సి కార్పొరేషన్ ఈడి అర్జున్ నాయక్, డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, నగర మున్సిపల్ కమిషనర్ వేంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే ఆదెన్న, వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రతినిధులు నీలం నాగేంద్ర, బిల్లా వసంతయ్య, పెద్దిపోగు కోటేశ్వర రావు, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.



