భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని,ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26ను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని, 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ప్రాప్తించాయన్నారు. భారతదేశంలో విభిన్న వర్గాలు, జాతులు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ ఒక్కటిగా కలిసి జీవించేలా చేసిన ఘనత మన రాజ్యాంగానిదేనని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి మరియు శాంతి వైపు నడిపించేందుకు డా. బి.ఆర్. అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారత ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అందించారని అధికారులు కొనియాడారు.
భారత రాజ్యాంగ విశిష్టత, ప్రాధాన్యతను తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక రోజు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుందని ఆకాంక్షించారు. రాజ్యాంగ పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర ముఖ్యమైనదని, అందులో భాగంగా పోలీసులు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో బాధ్యతాయుతమైన సేవలు అందించాలని కోరారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి వినిపించి పోలీసులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ ఏవో రామ్మోహన్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, అర్ఐ లు రమణారెడ్డి, సీతారామరెడ్డి, డిపిఓ సూపరింటెండెంట్లు సంధాని భాషా, శైలజ, ఎస్సైలు జాన్ పీటర్, సురేష్ బాబు, శ్రీనివాస రావు, తిరుపతి స్వామి, మస్తాన్ వల్లి మరియు సిబ్బంది పాల్గొన్నారు.





