ఒంగోలులోని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి కార్యాలయ సిబ్బంది రిసోర్స్ పర్సన్స్ (అర్ పిలు), కమ్యూనిటీ ఆర్గనైజర్లు మరియు బ్యాంకర్ల ప్రమేయంతో చట్టవిరుద్ధమైన మరియు అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని మరియు నకిలీ గ్రూపులను సృష్టించడం ద్వారా కోట్లాది ప్రభుత్వ నిధులను దోచుకున్నారని వివిధ పత్రికల్లో ప్రచురించిన నేపధ్యంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు నేడొక ప్రకటనలో తెలిపారు.
ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్ చైర్మన్ గాను, డిఆర్డిఎ పిడి, జిల్లా పరిషత్ సిఈఓ సభ్యులుగా ఉంటారన్నారు. ఒంగోలులోని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయ సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై ఈ కమిటీ విచారణ జరిపి రెండు (2) వారాల్లోగా విచారణ నివేదికను సమర్పించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ విచారణలో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు.
