నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ వాయుగుండం ప్రభావంతో జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిత్వా తుఫాన్ సందర్భంగా చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లుపై మండలాల వారీగా, శాఖల వారీగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 14 మండలాల్లో 168 గ్రామాల్లో దిత్వా తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ముందస్తుగా ఏర్పాట్లు సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు. నీటిపారుదల, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్తు, ఆర్అండ్ బీ, వ్యవసాయ, పశుసం వర్ధక, పంచాయతీ రాజ్, మున్సిపల్, శాఖలతో పాటు అన్ని లైన్ డిపార్ట్మెంట్లు అప్రమత్తంగా ఉంటూ.. తగు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు కురిసేటప్పుడు అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని, నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ప్రజలకు సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ముఖ్యంగా తీర ప్రాంత మండల ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ మండల పరిధిలోని అన్నీ శాఖల క్షేత్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అన్నీ చెరువుల వద్ద క్షేత్ర స్థాయి సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వరి కోత సీజన్ ప్రారంభం అయినందున తుఫాన్ ప్రభావం తగ్గేవరకు వరి కోతలు కోయకుండా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు తెలియ చేయాలని తెలిపారు. రైతులు తొందర పడి వరి పంట కోసినట్లయితే ధాన్యం తడిసే అవకాశం ఉన్నందున తుఫాన్ ప్రభావం తగ్గేవరకు వరి పంట కోయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
