హైదరాబాద్, డిసెంబర్ 3:
(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
జీ హెచ్ ఎం సి నిధులతోవేగవంతమైన పనులు ప్రారంభిస్తామని
గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి తో కలిసి తార్నాక డివిజన్‌లోని మాణికేశ్వరి నగర్, రవీంద్ర నగర్ మరియు పార్థివాడ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ, నగర పల్లె అభివృద్ధి విభాగాలు, పర్యావరణ శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు ప్రతి బస్తీలో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని నమోదు చేశారు. బస్తీ బాట లో ప్రధానంగా రహదారుల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణం, చెత్త వ్యవస్థలో లోపాలు, వీధిదీపాల పనితీరు, డ్రైనేజ్ బ్లాకేజీలు, నాలాలో డీసిల్టింగ్, మంచినీటి సరఫరాలో అంతరాయాలు, కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ, పాఠశాలల చుట్టుపక్కల శుభ్రత, స్మశాన వాటిక అభివృద్ధి, బస్తీ దవాఖాన సేవల బలోపేతం వంటి పలువురు అత్యవసర సమస్యలు ప్రజల నుంచి తెలుసుకున్నారు.ప్రతి సమస్యపై అక్కడికక్కడే సంబంధిత అధికారులను డిప్యూటీ మేయర్ తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను నేరుగా వినడం, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. బస్తీ బాట కార్యక్రమం కేవలం సమస్యలను వినడానికి మాత్రమే కాకుండా, బస్తీ అభివృద్ధిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఒక ప్రజామిత్ర కార్యక్రమమని వివరించారు. జిహెచ్ఎంసి లోని పలు డివిజన్లలో ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించబడిందన్నారు. ప్రజల నుండి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని దీనిని మరింత విస్తరించనున్నట్లు ఆమె చెప్పారు.బస్తీ అభివృద్ధి కోసం జిహెచ్ఎంసి కౌన్సిల్ సాంక్షన్ చేసిన రెండుకోట్ల నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఈ నిధులు పారదర్శకతతో పాటు అత్యవసర అవసరాలను బట్టి ఖర్చు చేయాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ముఖ్యంగా ఇంటీరియర్ రోడ్లు, కాలువలు, వీధిదీపాలు, వర్షాకాల డ్రైనేజ్ సమస్యలు, పార్కుల అభివృద్ధి, చిన్నారుల ఆట స్థలాలు, మహిళల కోసం రక్షిత ప్రదేశాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఆమెసూచించారు.ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసి వ్యవస్థపై చూపుతున్న నిబద్ధతను డిప్యూటీ మేయర్ ప్రశంసిస్తూ, ఆయన బస్తీ స్థాయి నుండి నగర స్థాయి వరకు విస్తృతంగా పర్యవేక్షిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచిస్తున్నారని తెలిపారు. అలాగే నగర ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హైదరాబాద్ అభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతి విభాగంతో సమన్వయం చేసి పనులు నిర్వహిస్తున్నారని ఆమె అభినందించారు. బస్తీ బాట కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండే పాలనను అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజలు అభినందిస్తున్నారనిఆమె పేర్కొన్నారు.
స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని సమస్యలను నేరుగా డిప్యూటీ మేయర్‌తో పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ – ఇంత కాలం పెండింగ్‌లో ఉన్న పనులు ఈ కార్యక్రమం ద్వారా వేగంగా పరిష్కారమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలు, చెత్త సేకరణ, డ్రైనేజ్ క్లీరెన్స్, నాళాల శుభ్రత, రోడ్ల మరమ్మతులపై తక్షణ స్పందన వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.ఈ బస్తీ బాట కార్యక్రమం ద్వారా తార్నాక డివిజన్‌లోని మాణికేశ్వరి నగర్, రవీంద్ర నగర్, పార్థివాడ ప్రాంతాలు త్వరలోనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయని అధికారులు తెలిపారు. ప్రజలతో మమేకమై సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పునరుద్ఘాటించారు.


