సికింద్రాబాద్ డిసెంబర్ 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
పద్మారావు నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. పద్మారావు నగర్ లోని మెయిన్ రోడ్ పై నిత్యం డ్రైనేజీ వాటర్ ప్రవహిస్తుండటంతో కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన బుధవారం గాంధీ హాస్పిటల్ వెనుక ఉన్న పద్మారావు నగర్ మెయిన్ రోడ్ పై తిరిగి ఓపెన్ నాలాను పరిశీలించారు. సమస్య గురించి స్థానికులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ లకు కలిపి ఒక్కటే లైన్ ఉండటం వలన మ్యాన్ హోల్ పొంగి రోడ్డుపైకి నీరు చేరుతుందని అధికారులు వివరించారు. పద్మారావు నగర్ పార్క్ నుండి పల్స్ హాస్పిటల్ వరకు డ్రైనేజీ, స్ట్రామ్ లైన్ లకు వేరు వేరుగా నూతన లైన్ ల ఏర్పాటు కు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అదేవిధంగా ఓపెన్ నాలాకు ప్రస్తుతం ఉన్న జాలి సరిగా లేనందున నూతన జాలి ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన లైన్ ఏర్పాటు చేసే వరకు ప్రతిరోజు డీ సిల్టింగ్ చేపట్టేలా పర్యవేక్షించాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ఓపెన్ నాలాలో చెత్త, వ్యర్ధాలు వేయవద్దని, వేయడం వలన సమస్యలు కూడా మీకే ఎదురవుతాయని కాలనీ వాసులకు ఆయన చెప్పారు. అదేవిధంగా అభినవ నగర్ లో రోడ్డు గుంతలమయంగా మారిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, నూతన రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు పలు చోట్ల స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరగా, అవసరమైన ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్ల ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెంకటాపురం కాలనీలో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ పై ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం చేయాలని కాలనీ వాసులు కోరగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతోనే తాను నిత్యం నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెంట డి సి డాకు నాయక్, ఈ ఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ జీ ఎం వినోద్, డి జి ఎం కృష్ణ, పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, పద్మారావు నగర్ అసోసియేషన్ ప్రతినిధులు బాల్ రెడ్డి, చక్రధర్, కృష్ణారావు, డాక్టర్ రమేష్, జగ్గయ్య, భట్, నాయకులు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీపతి, మహేందర్ గౌడ్, అంబులెన్స్ సురేష్, అబ్బాస్, మహేందర్ తదితరులు ఉన్నారు.


