రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ‘ రైతన్నా – మీకోసం ‘ కార్యక్రమంలో భాగంగా బుధవారం మద్దిపాడు మండలం దొడ్డవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట ఉత్పత్తులకు అవసరమైన గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు సాగులో నూతన పరిజ్ఞానాన్ని రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. వినూత్న విధానాలతో రాబడి పెంచుకునేలా రైతులు కూడా ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. ఆయా విషయాలపై అవగాహన కల్పించేందుకే ఇలాంటి ప్రత్యేక వారోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాగులో రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ సిబ్బంది అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు. భూమి రకం, వాతావరణ పరిస్థితులు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు వారు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. రైతులు, వ్యవసాయ అధికారులు సమిష్టిగా పనిచేస్తేనే ఈ రంగం మరింత అభివృద్ధి వైపు సాగుతుందని కలెక్టర్ చెప్పారు. అందుకే స్థానిక వనరులను సమర్ధంగా రైతులు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, తహసిల్దార్ ఆదిలక్ష్మి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ముందుగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని వీరంతా వీక్షించారు.


హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంత మాత్రమూ సహించబోను – కలెక్టర్ పి.రాజాబాబు
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంత మాత్రమూ సహించబోనని కలెక్టర్ పి.రాజాబాబు
స్పష్టం చేశారు. హాస్టళ్లలోని పరిస్థితులను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మద్దిపాడులోని బీసీ, ఎస్సీ బాలుర హాస్టళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా ప్రాంగణాలు మొత్తం కలియతిరిగి తరగతి గదులను, టాయిలెట్లను, ఇతర వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. బీసీ హాస్టల్లో మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్లను తనిఖీ చేసి వంట సరుకుల నిల్వలను పరిశీలించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం సరఫరా చేసిన వేరుశనగ చిక్కీలను వారికి సక్రమంగా వార్డెన్ అందజేయకపోవటంపై తీవ్రంగా కోప్పడ్డారు. వార్డెన్ ను తక్షణమే అక్కడి నుంచి బదిలీ చేయాలని జిల్లా
బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతిని ఆదేశించారు. విశాలమైన హాస్టల్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ చెప్పారు.
ఎస్సీ హాస్టల్ లో స్టడీ అవర్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ దిశగా అంచనాలు రూపొందించాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్ కు చెప్పారు. విద్యార్థులలో ప్రమాణాలు పెంచేందుకు టూటర్లను నియమించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. హాస్టళ్ల వార్డెన్లు కూడా బాధ్యతాయతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావించి వారి సమగ్ర ఎదుగుదలకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ రెండు హాస్టళ్లలోని విద్యార్థుల సంఖ్య, తాగునీటి సౌకర్యం, వారి ఆరోగ్య స్థితిగతులు, క్రమంగా చేస్తున్న వైద్యపరీక్షలపై కలెక్టర్ ఆరా తీశారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. బాల శంకర రావు, తహసిల్దార్ ఆదిలక్ష్మి, ఇతర అధికారులు ఉన్నారు.

