డివిజన్ స్థాయిలో అభివృద్ధి అధికారి ఉండటం వలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
చెప్పారు. పాత జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన
ఒంగోలు డివిజన్ డెవలప్మెంట్ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏ.పీ.డీ. కార్యాలయాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖలో వినూత్న మార్పులు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఎంపీడీవోలకు ప్రమోషన్లు ఇచ్చి డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా బాధ్యతలను అప్పగించిందన్నారు. దీని ద్వారా ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఎంపీడీవోలకు ప్రమోషన్లు లభించడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి అన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని డివిజనల్ స్థాయి కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. దీనికి ముందుగా రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల కార్యాలయాలను చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించి, అనంతరం ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ. కె. పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు వీక్షించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, పంచాయతీరాజ్ ఎస్.ఈ. అశోక్, జడ్పీ సీఈవో జాలమ్మ ( ఇంచార్జ్), ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డి.ఎల్.డి.వో. సువార్త, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు*
ఎంపీడీవోలుగా నియమితులై 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నప్పటికీ ఎంపీడీవోలుగానే కొనసాగుతున్న తమకు ప్రత్యేక గుర్తింపు లభించేలా ప్రమోషన్లు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ కు మార్కాపురం డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ బాలు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. మార్కాపురం నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన , ఉప ముఖ్యమంత్రితో మాట్లాడారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించి అభివృద్ధి పనుల్లో వేగం పెరిగేలా చూస్తామన్నారు.



