చదువుతోనే ప్రతిఒక్కరికి విజ్ఞానం, విద్యార్థుల ఎదుగుదలకు తల్లిదండ్రులే తొలి గురువులని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఒంగోలు నగరంలోని పీవీర్ బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. విద్యాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో 65 లక్షల మంది విద్యార్థుల తల్లి ఖాతాలో తల్లికి వందనం పథకం ద్వారా రూ.87 వేల కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జీవితంలో పిల్లలు సక్రమమైన మార్గంలో పయనించడానికి వారి తల్లిదండ్రులే తొలి గురువులనీ పేర్కొన్నారు. విద్యార్థులు మంచి మార్గంలో నడవడానికి చదువు ఒక్కటే మార్గం అన్నారు. నేటి కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం వల్ల వారి జీవిత మనుగడకు తీవ్ర దుష్పలితాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకొనే సమయంలో సెల్ ఫోన్లను తల్లిదండ్రులు దూరంగా ఉంచాలని కోరారు. విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించేలా ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీట వేసిందని అన్నారు. విద్యాభివృద్ధికి , విద్యార్థుల సంక్షేమానికి పాటు పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని కోరారు. చదువే భవిష్యత్ లో పిల్లలకు మంచి ఆస్తి అని శాసనసభ్యులు జనార్దన్ పేర్కొన్నారు.విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు. విద్యార్థులు చదువులో రాణించి సమాజాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
