డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు, అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
చెప్పారు. బాబా సాహెబ్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం ఒంగోలు నగరంలోని హెచ్.సి.ఎం. సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రితో పాటు కలెక్టర్ , ఒంగోలు, సంతనూతలపాడు
ఎమ్మెల్యేలు, నగర మేయర్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు.
కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని
కొనియాడారు. ఈ దిశగా ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి అంబేద్కర్ ఇచ్చారని, ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ప్రపంచం మొత్తం మేధావిగా కొనియాడుతున్న ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు.
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ ప్రస్తుత విగ్రహం పాతదైనందున
ట్రంక్ రోడ్డు విస్తరణ అనంతరం ఈ ప్రాంతంలోనూ, అంబేద్కర్ భవనం వద్ద కూడా కాంస్య విగ్రహాలను పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ కేవలం వెనకబడిన వర్గాలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికీ అంబేద్కర్ నాయకుడని అన్నారు. అపార ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప మేధావి అని ఆమె కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆర్. వెంకట్రావు, దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్ర, బిల్లా చెన్నయ్య, బిల్లా వసంతరావు, చప్పిడి వెంగళరావు, తదితరులు పాల్గొన్నారు.



