హైదరాబాద్ డిసెంబర్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహిళా విద్యార్థుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. బుధవారం కమిషన్ చైర్ పర్సన్ కోటి లోని మహిళా యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల మెస్, ఉస్మానియా క్యాంపస్ పీ జీ మెస్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల మీడియాలో వచ్చిన మెస్ ఇన్ చార్జికి సంబంధించిన వార్తలపై చైర్పర్సన్ విచారణ జరిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం హాస్టల్ మెస్ ను పరిశీలించి భోజన నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, సదుపాయాలను తనిఖీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ హాస్టల్ సంబంధిత అధికారులతో సమావేశమై మహిళా విద్యార్థుల భద్రత సౌకర్యాలు పర్యవేక్షణ పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాలన్నీ పరిశీలించి వారి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చూడాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలని కళాశాల యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు భయపడకుండా స్వేచ్ఛగా సురక్షిత వాతావరణంలో చదువుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు వచ్చిన నేరుగా మహిళా కమిషన్ ని సంప్రదించాలని సూచించారు. మహిళా కమిషన్ ఎల్లప్పుడూ మహిళలకు అందుబాటులో ఉంటుందని వారి హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని చైర్పర్సన్ అన్నారు.


