బేగంపేట డిసెంబర్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సురక్షిత సమాజం కోసం స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ ఎయిర్ లైన్స్ కాలనీలో బుధవారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న కాలనీ అసోసియేషన్ సభ్యులను ఏ సి పి గోపాల కృష్ణమూర్తి అభినందించారు. ముందుగా కాలనీ పార్కులో నిర్వహించిన గణపతి పూజా కార్యక్రమంలో ఏసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోలీస్ అధికారుల పిలుపుతో తాము తమ కాలనీలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ నేతృత్వంలో ఉత్తర మండలం డి సి పి ఎస్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో నగరం నడిబొడ్డున ఉన్న బేగంపేట ను మరింత సురక్షితంగా ఉంచాలనీ నిర్ణయించామన్నారు. ప్రతి కాలనీ అసోసియేషన్ లు.బస్తీ సంఘాలు,వ్యాపార సముదాయాలు.ఆసుపత్రులు.ఇలా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సీ సీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఇప్పటికే బేగంపేట పోలీసులు సీ సీ కెమెరాల ప్రాధాన్యత పై ప్రజలకు అవగాహన కల్పించారని ఆయన గుర్తు చేసారు.బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొంత భాగం కాలనీలు,వ్యాపార సముదాయాలు,ఆసుపత్రులు,మరికొన్ని బస్తీలు ఉన్నాయన్నారు.ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సంఘటన జరిగినా వాటిని వీలైనంత త్వరగా గుర్తించాలంటే సీ సీ కెమెరాలు ఏర్పాటు తప్పని సరి అన్నారు. సీ సీ కెమెరాల ద్వారా ఇటీవల కొన్ని నేరాలను వేగంగా చేధించ గలిగామని తెలియ జేశారు.ముఖ్యంగా వ్యాపార సముదాయాలు,కార్పొరేట్ కార్యాలయాల వారు ఈ విషయంలో మరింత చొరవ చూపాలని కోరారు.బేగంపేట ఇండియన్ ఎయిర్ లైన్స్ కాలనీలో అసోసియేషన్ సభ్యులు ఈ విషయంలో స్పందించి సీ సీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని ఏ సి పి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు,ఎస్సై శ్రీధర్ పాల్గొన్నారు.

