విద్య భవిష్యత్తుకు బంగారు బాటని ప్రతి విద్యార్థి ఉన్నతమైన శిఖరాలు చేరడానికి కష్టమనుకోకుండా ఇష్టపడి చదివి విజేతలుగా నిలవాలని ప్రకాశం జిల్లా విద్యాశాఖధికారి సి.వి.రేణుక అన్నారు. బుధవారం విద్యాశాఖధికారి కార్యాలయంలో మాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్బంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో విద్య మీద అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తున్న మాస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులను అభినందించారు. సంస్థ అధ్యక్షులు శివాజీ మాట్లాడుతూ విద్య, సమాజం మీద అంబేద్కర్ ఆలోచన విధానం అను అంశం మీద జరిగిన పోటీలలో మొదటి బహుమతి మాంటిస్సోరి స్కూల్ విద్యార్థిని ఎం. మేఘన రెండవ బహుమతి అపెక్స్ స్కూల్ విద్యార్థిని పి. భారతి మూడవ బహుమతి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని టి. బాల భవ్యశ్రీ లు గెలుచుకున్నారని తెలిపారు. మరో 10 మంది విద్యార్థులు కన్సోలేషన్ బహుమతులు పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జోషప్ ఐ. రవికుమార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

