గర్భిణులు, బాలింతలు,చిన్నారుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అందులో భాగంగా అంగన్ వాడీ వ్యవస్థలో ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ ఐసీడీఎస్ సిబ్బందికి మంత్రి 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సేవల్లో వేగం, పారదర్శకతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందులో భాగంగా అంగన్ వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను అందించడం జరిగిందన్నారు. వీటి సహకారంతో పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,204 అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్ల పంపిణీకి రూ.75 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెరిగాయన్నారు. గతంతో పోలిస్తే అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవం, ఆర్థిక భద్రత పెరిగిందన్నారు. రాష్ట్రంలో 5 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాల స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, భవనాలు, తాగునీరు, మరుగుదొడ్లు మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.


