ఒంగోలులోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ఆర్టీసీ డిపో అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ కి వివరించారు. అందుకు అవసరమైన స్థలం మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ని ఆర్టీసీ డిపోకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగిందని అందుకు అవసరమైన స్థల కేటాయింపు అవసరమని వారు వివరించారన్నారు.
దీనిపై జిల్లా కలెక్టర్ రాజబాబు సానుకూలంగా స్పందించి స్థానిక రెవిన్యూ సిబ్బందితో డిపోకు అనువుగా ఉండే ప్రభుత్వ స్థలాన్ని అన్వేషిస్తామని హామీ ఇచ్చినట్లు వారు వివరించారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, నిధుల మంజూరు పనుల పురోగతి తదితరాంశాలపై కలెక్టర్ గారితో చర్చించారు.
తూర్పు వీరాయపాలెంలో పట్టాల పంపిణీ, ఇళ్ల స్థలాల కేటాయింపు, అభివృద్ధి కార్యక్రమాల అమలును కలెక్టర్ ఈ సందర్భంగా పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులు, నిధుల మంజూరు పై కూడా చర్చించారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ కాలనీల లో రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల మంజూరు అంశాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ కలెక్టర్ కి విన్నవించారు.
అదేవిధంగా దర్శి మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్ల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు పనుల ప్రారంభం, సంక్షేమ పథకాల అమలు, సిబ్బంది కొరత తదితర అంశాలపై కలెక్టర్ తో డాక్టర్ లక్ష్మీ, తెలుగుదేశం పార్టీ యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు దీర్ఘంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రకాశం జిల్లా అభివృద్ధి పురోగతిపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించడం ఎంతో గర్వకారణమని కలెక్టర్ రాజబాబు ని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా దర్బారులో ప్రజల నుండి వచ్చిన కొన్ని సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
దర్శి అభివృద్ధి సంక్షేమం లో మీ సంపూర్ణ సహకారానికి మా కృతజ్ఞతలని ఆమె అన్నారు.
అన్న క్యాంటీన్ నిర్మాణం పనులు పూర్తయ్యాయని త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ కి డాక్టర్ లక్ష్మీ తెలిపారు.


