కీలక కేసుల దర్యాప్తులో రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చిన స్ఫూర్తితో, రెట్టింపు ఉత్సాహంతో మున్ముందు కూడా పని చేయాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా, ఎన్.జి.పాడు మండలం, అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు ఏప్రిల్ 22వ తేదీ 2025న రాత్రి సుమారు 07-30 గంటల సమయంలో శశిరేఖ ఏజెన్సీ బిల్డింగ్, 2 వ ఫ్లోర్, సాంబశివ నగర్, ఒకటవ లైన్, మెయిన్ రోడ్, ఒంగోలు, మృతుడు ముప్పవరపు వీరయ్య చౌదరి చెందిన ఆఫీస్ లో మద్యం షాపుల లెక్కలు తమ అకౌంటెంట్స్ లతో చూస్తున్న సమయంలో, నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీ మరియు మోటార్ సైకిల్ పై వచ్చి తన ఆఫీస్ లోనికి ప్రవేశించి, వీరయ్యను కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి, కేకలు వేసిన అకౌంటెంట్ లను ఆఫీస్ లోని సిబ్బంది ని బెదిరించి, అక్కడనుండి పారిపోయినారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు లోతుగా దర్యాప్తు చేసి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిల అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపటం జరిగింది. ఈ నెల 19వ తేదీన మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా, గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి సమక్షంలో ఏబిసిడి అవార్డు ప్రదానం చేయటం జరిగింది. కేసులో అత్యుత్తమ విధులు నిర్వహించిన పోలీసు అధికారుల నేతృత్వంలో చేపట్టిన సమగ్ర దర్యాప్తు ఫలితంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు ఈ అవార్డు లభించింది.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ప్రస్తుత్తం విజయనగరం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఏ.ఆర్. దామోదర్ ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యు. సుధాకర్, ప్రస్తుత ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ యస్. జగదీష్, డీటీసీ ఇన్స్పెక్టర్ వై. పాండురంగారావు, గతంలో చీమకుర్తి ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన యం. సుబ్బారావు, సోషల్ మీడియా సెల్ ఇన్స్పెక్టర్ వి. సూర్యనారాయణ, సంతనూతలపాడు ఎస్సై వి.అజయ్ బాబు ఈ అవార్డును అందుకున్నారు.ఇలాంటి కేసులను సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే ప్రజల్లో పోలీసు శాఖపై గౌరవం మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ అవార్డును స్ఫూర్తిగా తీసుకొని, జిల్లా పోలీసులు భవిష్యత్తులో కూడా మరిన్ని కేసులను సమిష్టిగా, సమర్థవంతంగా ఛేదించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తుల్లో అత్యంత ప్రతిభ కనపరచడాన్ని గుర్తించి ప్రతిష్టాత్మకంగా ప్రతీ మూన్నెళ్లకు ఒకసారి ప్రకటించే ఏబిసిడి ( అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్ ) అవార్డు జిల్లాకు దక్కడం. అందునా రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం విశేషం.జిల్లా పోలీసు శాఖ సాధించిన ఈ ఘనత మరింత బాధ్యతతో ప్రజల భద్రత కోసం పనిచేయడానికి ప్రేరణగా నిలవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.
