ఆకాంక్షిత మండలంలో అభివృద్ది పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభారి అధికారి వి.
శ్రీనివాసరావుఅన్నారు. కేంద్ర ప్రభుత్వము యాస్పిరేషనల్ బ్లాక్ కింద చేపట్టిన జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో జరుగుతున్న అభివృద్ది పనుల పర్యవేక్షణకు నియమితులైన ప్రభారి అధికారి శ్రీనివాసరావు శుక్రవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధికి ఆస్కారం ఉండి ప్రత్యేక దృష్టి సారిస్తే సాధించగలిగే అవకాశం ఉన్నట్లు గుర్తించిన ఆకాంక్షిత మండలంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 39 అంశాలలో కొన్ని అంశాల్లో వంద శాతం లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ద చూపాలన్నారు. క్షేత్ర పర్యటనలో తన దృష్టికి వచ్చిన అంశాల గురించి వివరించారు. దీనిపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో లక్ష్యాల మేరకు పనిచేసినప్పటికీ సాంకేతిక సమస్యల వలన ఆ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయలేకపోయామన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆకాంక్షిత మండలంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించాలన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయిలో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో సిపిఓ సుధాకర్ రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ పద్మశ్రీ, డిఆర్డిఏ పిడి నారాయణ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. బాల శంకరరావు, డ్వామా పిడి జోసఫ్ కుమార్, ఐటీడీఏ, ఐసిడిఎస్, అటవీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.


