ప్రజావాణి భారత దేశంలో ఎక్కడా అమలు జరగడం లేదు – 74 శాతం సమస్యల పరిష్కారం గొప్ప విజయం.- ప్రజావాణి రెండవ వార్షికోత్సవ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
పాల్గొన్న మంత్రులు జూపల్లి కృష్ణా రావు, పొన్నం
హైదరాబాద్ డిసెంబర్ 19
(జే ఎస్ డి ఎం.న్యూస్)
సీఎం ప్రజావాణి వంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా అమలు జరగడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రజావాణి రెండవ వార్షికోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై భట్టి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, పాలన ప్రజల కోసమే అని సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ సహచరులు అంతా కలిసి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ప్రజావాణి అని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. ప్రజల సమస్యలు విని పరిష్కారం చేయడానికి ప్రతి మంగళ, శుక్రవారాలు రెండు రోజుల పాటు క్రమం తప్పకుండా దరఖాస్తులు తీసుకొని 74% సమస్యలు పరిష్కారం చేయడం గొప్ప విజయమని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజావాణి పెట్టడమే కాదు వచ్చిన దరఖాస్తులను నిబద్దతతో దృష్టి సారించి ఉద్యోగ బృందం ప్రయత్నం చేయకపోతే 74% విజయం సాధ్యం కాదని తెలిపారు. ఇంకా పరిష్కారం కానీ పైప్ లైన్ లు వంటి అంశాలను పరిష్కరించే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ఏ సంకల్పంతో ప్రజావాణిని ప్రారంభించామో ఆ లక్ష్యం నెరవేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమం క్రమంతప్పకుండా కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం ఉన్నారు.
10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వారు ప్రజల కోసం కనీసం ప్రజాభవన్ గేట్లు తెరవని వారు కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని మొక్కుబడిగానిర్వహిస్తున్నారు అంటూ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో విజయ గాధలు వింటుంటే సిబ్బంది ఎంత చిత్తశుద్ధితో పనిచేశారో వివరించి అభినందించేందుకే తాను ఈ సమావేశానికి వచ్చానని డిప్యూటీ సీఎం తెలిపారు. మా ఆలోచన, పాలన, వ్యవహారం అంతా ప్రజలకే అంకితం అని అన్నారు. రాష్ట్రంలోని సంస్థలు, వ్యవస్థలు ప్రజల కోసం ఉపయోగపడాలి అనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఏమాత్రం భయం లేకుండా ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిని ఆశీర్వదించండి. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుకు వెళదామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కార వేదిక సీఎం ప్రజావాణి అని పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని వారు అన్నారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో సీఎం ప్రజావాణిలో ఒక లక్ష 07, 829 దరఖాస్తులు అందగా అందులో 64,623 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయని, మిగతా 48, 064 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని, సమస్యల పరిష్కారం 74% శాతం ఉందని తెలిపారు. సిబ్బంది, అధికారులు ఎంతో ఓపికతో ప్రజల సమస్యలు వింటూ పరిష్కారం చూపుతున్నారని చిన్నారెడ్డి అభినందించారు.
సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ప్రజావాణి లక్ష్యాలను, సాధించిన పురోగతిని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, హోసింగ్ శాఖ కార్యదర్శి వీ.పీ. గౌతమ్, సీ జీ జీ చైర్మన్ రవి గుప్తా, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరి చందన, తదితరులు పాల్గొన్నారు.
సీఎం ప్రజావాణి ద్వారా లబ్ది పొందిన వివిధ వర్గాల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పదేళ్ల క్రితం ఆర్టీసీలో సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన 242 మంది డ్రైవర్స్, కండక్టర్స్ కు ప్రజావాణి ద్వారా తిరిగి ఉద్యోగాలు రావడం, కోర్టు కేసుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న 1,750 మందికి ప్రజావాణి ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అలాట్ కావడం, ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావడం, గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం వంటి అనేక విజయ గాథలు ఈ కార్యక్రమంలో లబ్దిదారులు తెలిపారు.


