ప్రేమ, సమభావం, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలన్న ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి
చెప్పారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ పి.రాజాబాబు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని మతాల విశ్వాసాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాస్టర్లకు గౌరవ వేతనాన్ని ఇస్తున్నట్లు చెప్పారు.
ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఏడాది డిసెంబర్ 24వ తేదీ ఒంగోలు జేయంబి చర్చిలో జరిగే క్యాండిల్
లైట్స్ వేడుకల్లో క్రమం తప్పకుండా తాను పాల్గొంటున్నట్లు చెప్పారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రేమ, దయ, క్షమ అనేవి యేసుక్రీస్తు చూపిన మార్గాలని చెప్పారు. చిన్నప్పుడు తాను కూడా మిషనరీ స్కూల్లోనే చదువుకున్నానని తెలిపారు. క్రీస్తు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమన్నారు.
ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మేయర్, డిఆర్ఓ మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అతిథులు క్యాండిల్స్ వెలిగించి, కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పార్థసారథి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, డ్వామా పీ.డీ. జోసఫ్ కుమార్, స్టెప్ సీ.ఈ.వో. శ్రీమన్నారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.




