ప్రాథమిక రంగంలో మెరుగైన ఫలితాలు రాబట్టేలా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
స్పష్టం చేశారు. ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ – దాని అనుబంధ రంగాలలో నెలకొన్న పరిస్థితులపై ఆయన సమీక్షించారు. క్షేత్రస్థాయి స్థితిగతులు, ప్రభుత్వ పథకాల అమలు, పరిస్థితులకు తగినట్లుగా వృద్ధి సాధించేలా శాఖాపరమైన ప్రతిపాదనలపై ఆయన ఆరా తీశారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి)లో ప్రాథమిక రంగం నుంచి వస్తున్న ఉత్పత్తి, వాటికి మరింత విలువ జోడింపు( జీ.వీ.ఏ) పై ఉన్నతాధికాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులను అమలు చేసి, రసాయనాల వినియోగాన్ని తగ్గించి, మెరుగైన ఉత్పత్తి సాధించేలా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మూస ధోరణి కాకుండా మారుతున్న పరిస్థితులు, మార్కెటింగ్ పై అవగాహన కలిగి రైతులు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. అవసరమైన స్థాయిలో యూరియా, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేయకుండా చూడాలన్నారు. మంచి లాభాలు వచ్చేలా పంట మార్పిడి వైపు రైతులను మళ్లించాలన్నారు. జిల్లాలో సెరికల్చర్ సాగు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పశువులకు అవసరమైన దాణా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని, పెండింగ్లో ఉన్న క్యాటిల్ షెడ్స్ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాలు, మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద పూర్తిస్థాయి ప్రయోజనాలు మత్స్యకారులకు అందించాలన్నారు. మైక్రో ఇరిగేషన్ పరికరాలను వినియోగించడం వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించి మెరుగైన పంట దిగుబడులు పొందేలా చూడాలన్నారు. నిబంధనలు అమలు చేయటమే పనిగా కాకుండా వినూత్నంగా ఆలోచించి జిల్లాలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాల ద్వారా మరింత ఉత్పత్తి వచ్చేలా అధికారులు, ఉద్యోగులు పనిచేయాలని కలెక్టర్ చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సిపిఓ సుధాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వరరావు, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, జిల్లా మత్స్శాఖ అధికారి శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు వరలక్ష్మి, నాబార్డ్ డిడిఎం రవికుమార్, జిల్లా సెరికల్చర్ అధికారి సుజన్ కుమార్, ఎల్.డి.ఎం. రమేష్, ప్రకృతి సేద్యం డిపిఎం సుభాషిణి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.


