ప్రజలు వివిధ కారణాల వల్ల తమ మొబైల్ ఫోన్లను కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావనతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజల ఆస్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పని చేస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ మిస్సింగ్ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయుటకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గుర్తించడం జరుగుతుందని తెలిపారు. మొబైల్ ట్రేసింగ్ ద్వారా గత 3 నెలల కాలంలో ప్రస్తుత 5 విడతలో రికవరీ చేసిన 342 మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.50 లక్షలుగా ఉందన్నారు. రికవరీలో యాపిల్, శాంసంగ్, వివో, రెడ్మి, ఒప్పో, వన్ప్లస్ తదితర కంపెనీలకు చెందిన మొత్తం 342 మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి, బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సంబంధిత బాధితులకు అందజేసారు.
2021 నవంబర్ 1 నుండి ఇప్పటి వరకు 5 విడతల్లో కలిపి మొత్తం 6,776 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. వీటి మొత్తం విలువ సుమారు రూ.9 కోట్ల 50 లక్షలుగా ఉంది. ఈ మొబైల్ ఫోన్లను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తించి సంబంధిత బాధితులకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఎవరైనా ఎక్కువ విలువ గల మొబైల్ ఫోన్ను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ రూపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తే, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి ఫోన్లను కొనవద్దని ఎస్పీ సూచించారు. అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా మొబైల్ ఫోన్లు అమ్మడానికి వస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఒకవేళ సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనాల్సిన పరిస్థితి వస్తే, తప్పనిసరిగా సక్రమమైన బిల్లును పరిశీలించి మాత్రమే కొనాలని సూచించారు.
నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైందని, వాటిలో వ్యక్తిగత సమాచారం మరియు విలువైన డేటా నిల్వ ఉండుట వల్ల ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఒకవేళ మీ సెల్ ఫోన్ ఎవరైనా చేతికి చిక్కినట్లయితే, వారు ఆ ఫోన్ను ఉపయోగించి నేరాలకు పాల్పడే అవకాశమున్నదని, అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఫిర్యాదు చేయు విధానం: మొబైల్ పోయినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఎస్పీ గారు స్పష్టం చేశారు.
CEIR పోర్టల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన www.ceir.gov.in వెబ్సైట్లో “Lost Mobile” ఆప్షన్ ద్వారా IMEI నెంబర్లు, ఫోన్ బిల్లు మరియు గవర్నమెంట్ జారీచేసిన ID ప్రూఫ్ వివరాలు నమోదు చేసి. పిర్యాదు నమోదు చేయవచ్చు. పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266 కు పంపవచ్చునని, అవసరం అయితే మొబైల్ పోయినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డ్ బ్లాక్ చేయించు కోవడం.
బ్యాంకు కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ను మార్చుకోవడం.
గుర్తుతెలియని వ్యక్తులకు మీ మొబైల్ ఫోన్ ను ఇవ్వకూడదు.
ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో దొరికిన మొబైల్ ఫోన్లను తీసుకుని వాడడం చేయరాదని, వాటిని స్థానికంగా పోలీసు స్టేషన్లలో అప్పగించాలని కోరారు.
అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా జిల్లా ప్రజలకు ఉత్తమ పోలీస్ సేవలు అందిస్తున్న జిల్లా ఎస్పీ గారికి మరియు పోలీసు సిబ్బందికి బాధితులు వారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు.
అభినందన:
ఫోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరచిన జిల్లాలోని పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


