ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పలు పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించాయి. టాస్క్ ఫోర్స్ సీఐ యు. సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్సైలు సుదర్శన్, శివరామయ్య, ఏఎస్ఐ మహబూబ్ భాషా మరియు సిబ్బంది ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించారు.
మద్దిరాలపాడు గ్రామ హైవే వద్ద బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి 6 బీర్ బాటిళ్లు, 5 క్వార్టర్ (180 ఎం. ఎల్) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని తాలూకా పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
అలాగే చదలవాడ గ్రామంలో (చీరాల రోడ్డు) మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి 10 బీర్ బాటిళ్లు, 6 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
గుండ్లపల్లి హైవే రోడ్డుపై నిర్వహించిన దాడుల్లో ఒక వ్యక్తి వద్ద 45 క్వార్టర్ బాటిళ్లు, అలాగే మరొక వ్యక్తి వద్ద 18 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
అల్లూరు గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, 31 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు నిమిత్తం కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 94 క్వార్టర్ బాటిళ్లు,16 బీర్ బాటిళ్లు,11 బాటిళ్లు (ఒక్కొక్కటి 90 మిల్లీలీటర్లు) మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.
జిల్లాలో ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 112 మరియు స్ధానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు.

