ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు రిమ్స్ లో వాటర్ సప్లై, ఎలక్ట్రిక్ మరమ్మత్తు పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కొండపి ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ యూనిట్, ఐపీ బ్లాక్, మెయిన్ గేట్ నిర్మాణ పనులపైనా మంత్రి చర్చించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. సింగరాయకొండలో నిర్మించనున్న ఆయుష్ భవనాలకు మంత్రి స్థలాన్ని ఎంపిక చేశారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరగా వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి అధికారులను ఆదేశించారు.

